IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ నీదా.? నాధా.? 1 y ago
చాంపియన్స్ ట్రోఫీ ఆఖరి అంకానికి చేరుకుంది. ఫైనల్ వార్‌కు ఇండియా, న్యూజిల్యాండ్ సన్నద్ధమవుతున్నాయి. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, న్యూజిల్యాండ్ ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఈ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. 14 మ్యాచ్‌లు.. 18 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్టాత్మక వన్డే పురుషుల టోర్నమెంట్లో ప్రపంచంలోని టాప్ 8 జట్లు పాల్గొగా.. చివరికి టాప్ 2 జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. భారత్ వరుసగా అన్ని మ్యాచ్ లు గెలుచుకుంటూ ఫైనల్ కి రాగా.. కివీస్ లీగ్ దశలో భారత్ తో ఓటమిని చవిచూసి..మళ్లీ కసిగా కప్ కొట్టాలని ఫైనల్ కు చేరుకుంది. ఇక్కడే తెలిసిపోతుంది రేపటి మ్యాచ్ ఎంత రసవత్తరంగా ఉండబోతుందోనని.
అయితే ఇక్కడ భారత్‌కు అడ్వాంటేజ్ ఉంది. న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్, దుబాయ్ ఇలా వేర్వేరు పిచ్ లపై ఇప్పటి వరకు మ్యాచ్‌లు అడింది. కానీ, ఇండియా మాత్రం దుబాయ్ లోని ఒకే మైదానంలో ఆడుతూ ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్ మ్యాచ్ కు మాత్రం కొత్త పిచ్ సిద్ధం చేస్తున్నారు. గత మ్యాచ్ ల మాదిరిగానే.. ఈ పిచ్ కూడా నెమ్మదిగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఒకసారి భారత్.. కివీస్ ముఖాముఖీ ఫలితాలు చూసుకుంటే.. 1975 నుంచి 119 ODI లు ఇరు జట్ల మధ్య జరిగాయి. అందులో భారత్ 61, న్యూజిలాండ్ 50 మ్యాచ్ లు గెలిచాయి. ఏడు మ్యాచ్ లు ఫలితం లేకుండా 1 మ్యాచ్ టైగా ముగిసింది. ఇలా చూసుకుంటే భారత్ దే పై చేయి. 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2021 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ కు షాకిచ్చింది. భారత్‌ను నాకౌట్ చేసి, అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ భయం ఇంకా భారత్ క్రికెట్ అభిమానుల్లో అలాగే ఉంది.
అయితే ఇప్పుడు ఈ ఓటములకు ప్రతీకారంగా టీమ్ ఇండియా న్యూజిల్యాండ్‌ను మట్టికరిపించగలదా?..మళ్లీ నాకౌట్లో కివీస్ పై చేయి సాధిస్తుందా? అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. దీంతో ఈ మ్యాచ్ తప్పకుండా చూడాల్సిందే అన్న భావన ప్రతి అభిమానిలో ఉంది. భారత్ జట్టులో కోహ్లీ, అయ్యర్ మంచి ఫామ్‌లో ఉన్నారు.. షమీ, వరుణ్ కూడా తమ బౌలింగ్ నైపుణ్యంతో ఇతర జట్టు ఆటగాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. న్యూజిల్యాండ్ జట్టులో రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్‌ను అంత తేలికగా తీసుకోలేం సుమీ.!
ఈ టోర్నమెంట్ మొత్తం ప్రైజ్ మనీ రు.60 కోట్లు. గత చాంపియన్స్ ట్రోఫీతో పోలిస్తే ఇది సుమారు 53 శాతం ఎక్కువ. గెలిచిన జట్టుకు రూ.19 కోట్లు.. రన్నరప్ కు రూ.9 కోట్లు వస్తాయి. ఫైనల్ ఉత్కంఠ భరితంగా ఉండనుంది. స్టేడియంలో ప్రత్యక్షంగా చూడలేని వారు జియో స్టార్ యాప్ లో మ్యాచ్ వీక్షించవచ్చు.